అవినీతిపై సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలా?: మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్

  • సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందన్న కొప్పుల ఈశ్వర్
  • నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు మాయపైపోతున్నాయని ఆరోపణ
  • చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా జగిత్యాల-ధర్మపురి పొలిటికల్ సర్కిల్స్‌లో హీట్ ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను టార్గెట్ చేస్తూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేక, లక్ష్మణ్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.


ధర్మపురి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కొప్పుల ఈశ్వర్ నేరుగా ఆరోపించారు. వీటితో పాటు నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్‌లు మాయమైపోతున్నాయన్నది పచ్చి నిజం కాదా అంటూ ఆయన నిలదీశారు. ప్రజా సమస్యలను, ఈ అవినీతి లెక్కలను పక్కదారి పట్టించడానికి మంత్రి లక్ష్మణ్ కుల రాజకీయం చేస్తున్నారని కొప్పుల మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్‌రావును ఉద్దేశించి ‘దొర’ అంటూ కులాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడటం ఏ రకమైన రాజకీయ సంస్కృతి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు నిజంగానే అవినీతిపై మాట్లాడే ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని కొప్పుల ఈశ్వర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అయితే మంత్రి పదవిని వదులుకోవడం అంత సులభం కాదని.. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్‌కు రాజీనామా చేసేంత ధైర్యం అస్సలు లేదంటూ ఎద్దేవా చేశారు.


Koppula Eshwar
Adluri Laxman
Telangana Politics
BRS vs Congress
Corruption Allegations
Dharmapuri Constituency

More Telugu News